Chandrababu: చంద్రబాబుకు దక్కని ఊరట.. క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ ఆలోపు సుప్రీంకోర్టుకు అందజేయాలని సీఐడీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది.
పిటిషన్పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వొకేట్లు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతికారం కోసమే సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా నిబంధనలు పాటించలేదని హరీష్ సాల్వే ధర్మాసనానికి విన్నవించారు. సాల్వే వాదనలపై స్పందించిన జస్టిస్ త్రివేదీ చంద్రబాబుపై మోపిన నేరం 2015 -16 నాటిదని, 17ఏ చట్ట సవరణ 2018లో జరిగినందున ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సాల్వే ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశంమని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం తప్పని హైకోర్టుకు విన్నవించినా తమ వాదనతో అంగీకరించలేదని చెప్పారు. గవర్నర్ అనుమతి తీసుకోనందున చంద్రబాబుకు అరెస్ట్ వర్తించదని సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
అనంతరం చంద్రబాబు తరుఫున వాదనలు వినిపించిన మరో అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించారని కోర్టు దృష్టికి తెచ్చారు. కేబినెట్ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరని, ఆ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగమని చెప్పారు. అలాంటి నిర్ణయాలపై ప్రతీకార చర్యల నుంచి 17ఏ రక్షణ కల్పిస్తుందని అన్నారు. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తిస్తుందన్న సింఘ్వీ.. ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇక సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్టైన 3 రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని, ఏకంగా 2వేల పేజీల పిటిషన్ ను న్యాయస్థానం ముందు ఉంచారని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కనీసం బెయిల్ అడగకుండా ఏకంగా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు సోమవారంలోగా అన్ని డాక్యుమెంట్లు కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.