మా బావ మంచిముత్యం, కుక్కలు మొరుగుతయ్.. బాలయ్య
X
ఏపీ ప్రభుత్వం తమపై పార్టీ నేతలపై, తమ కుటుంబంపై వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపుకు దిగుతోందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయన నిజమైన ప్రజాసేవకుడని చెప్పుకొచ్చారు. బాలయ్య మంగళవారం మంగళగిరిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కుక్కలు మొరుగుతుంటాయని, వాటిని పట్టించుకోనని అన్నారు.
‘‘మేం ఎవరికీ భయపడం. ఇప్పుడే కాదు మా నాన్నగారి హయాం నుంచి కూడా ఇలాంటివెన్నో చూశాం. చేతులు ముడుచుకుని కూర్చుకోలేం.. న్యాయపోరాటం చేస్తాం. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయన పులు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. ఇంకా ఎన్నో కేసులు పెడతారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్ని సంస్థలను విధ్వంసం చేసి రాష్ట్ర యువతను గంజాయికి బానిసనలు చేశారు. మనం మానవ హక్కుల కోసం పోరాడాలి. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, దీన్ని తీర్చాల్సిందే ప్రజలేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పథకాలు పేర్లు చెబుతున్నారే తప్ప ప్రజలకు లబ్ధి జరగడం లేదని టిడ్కో ఇళ్లను ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పందులు తిరుగుతున్నాయని, తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అద్భుత వైద్యసౌకర్యాలు కల్పించానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుగు తథ్యమని అన్నారు.