TTD : తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం..దర్శనానికి 12 గంటలు
X
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారికి నిన్న హుండీ ద్వారా రూ.5.48 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మళ్లీ చాలా రోజుల తర్వాత హుండీ ఆదాయం పెరిగినట్లుగా అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే స్వామి వారిని 69,314 మంది దర్శించుకున్నారు. 25,165 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రస్తుతం తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనానికి ఏకంగా 20 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ టికెట్ లేని సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇకపోతే తిరుపతి శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఫిబ్రవరి 16వ తేదిన రథసప్తమిని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై కోదండరామ స్వామి విహరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అదేవిధంగా మార్చి 1వ తేది నుంచి 10వ తేది వరకూ శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహన సేవలు ఉండనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను వినిపించనున్నారు.