Lokesh Sankharavam : నేటి నుంచి లోకేశ్ శంఖారావం..ఇచ్ఛాపురంలో స్టార్ట్
X
టీడీపీ ప్రధాన కార్యదర్మి నారా లోకేశ్ (Nara Lokesh) నేటి నుంచి శంఖారావం పేరుతో ప్రచార కార్యక్రమం చేపట్టనున్నారు. ఇచ్చాపురం నుంచి ఆయన ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్థానిక రాజావారి గ్రౌండ్స్‌లో ఆయన ప్రసంగిస్తారు. తొలి విడతలో ఉత్తరాంద్రలో యువగళం పాదయాత్ర జరగని నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటిస్తారు. యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన యువ నేత ఇప్పుడు శంఖారావం అంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(Ichapuram)లో తొలి బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు భారీ రోడ్ షోలో ఆయన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
తొలుత బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి(TDP) యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలను లోకేష్ అభినందించనున్నారు. బహిరంగ సభ అనంతరం.. ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్ తో యువ నేత ముఖాముఖిగా మాట్లాడనున్నారు. రానున్న ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలి. ప్రచారంలో ఏవిధంగా ముందుకు దూసుకుపోవాలిమ ప్రత్యర్థిలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న సూచనలు చేయనున్నారు. అధికార వైసీపీ పార్టీకి (YCP party) ఏమాత్రం భయపడొద్దని..తెలుగుదేశం అన్ని విధాల అండగా ఉంటుందని అభయమివ్వనున్నారు. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశానిదేనని భరోసా కల్పించనున్నారు. ఇచ్ఛాపురంలో యాత్ర ముగించుకుని ఆయన మధ్యాహ్నానికి పలాస చేరుకోనున్నారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ.. శ్రీకాకుళం(Srikakulam), పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆదివారం నుంచి నలభైరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో ‘శంఖారావం’ పేరుతో సభలు నిర్వహించనున్నారు.