టీడీపీ నేత ఫామ్ హౌస్‌లో అల్లు అర్జున్..
X
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. టీడీపీ నేత ముంటిమడుగు కేశవరెడ్డి ఫామ్ హౌస్‌లో ప్రత్యక్షమయ్యారు. అల్లు అర్జున్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శుక్రవారం కారులో వెళ్తూ.. గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్దగల ముంటిమడుగు ఫామ్‌హౌస్‌కు వచ్చారు. కేశవరెడ్డి, ఆయన కుమారుడు రాహుల్‌రెడ్డి.. అల్లు అర్జున్‌కు స్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన విందులో అల్లు అర్జున్ భోజనం చేశారు. రాయలసీమ వంటకాలను ఆయన ఎంతో ఇష్టంగా తిన్నారు. అల్లు అర్జున్ వచ్చాడనే విషయం తెలియగానే కేశవరెడ్డి ఫామ్ హౌస్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. బయటకొచ్చిన బన్నీ ఫ్యాన్స్ కోసం అభివాదం చేశారు. ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెంగళూరుకు బయల్దేరారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప- 2 లో నటిస్తున్నాడు. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పుష్ప- 2 ఫస్ట్ లుక్ సినిమా అంచనాలను మరింత పెంచేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2023 చివరిలో రిలీజ్ చేస్తారని సమాచారం. అదే విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబోలో మరోసారి సినిమా రానున్నట్లు ఇటీవల అధికారకంగా ప్రకటన వెలువడింది.