ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీదే అగ్రస్థానం :ప్రత్తిపాటి పుల్లారావు
X
ఏపీలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాష్ట్రంలో జూదం లేకుండా చేస్తానన్న ఏపీ సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని ఎద్దేవ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో పత్తిపాటి మాట్లాడుతూ..వైసీపీవై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ క్లబ్బులను మూసేసి పేకాట క్లబ్‌లు తెరిచారని మండిపడ్డారు. చిలకలూరిపేటలోని అపార్టుమెంట్లలో, బజార్లలో జోరుగా పేకాట నడుస్తోందని..దీని వెనుక మంత్రి విడదల రజిని ఉన్నారని ఆరోపించారు. పేకాట క్లబ్‌ల ద్వారా మంత్రి రజిని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. ఏపీ మొత్తం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారని పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారన్నారు. పేకాట క్లబ్‌ల కారణంగా పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.