TTD : వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. 'గోవింద కోటి' రాస్తే బ్రేక్ దర్శనం
X
తిరుమల తిరుపతి దేవస్థానం యువతకు శుభవార్త చెప్పింది. కళియుగ ప్రత్యక్షదైవం అయిన శ్రీవేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. స్వామివారి దర్శనం చేసుకుని తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం యువత కోసం సరికొత్త దర్శనాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేసింది.
25 ఏళ్ల లోపు యువత 'గోవింద కోటి' అని పది లక్షల 116 సార్లు రాస్తే వారికి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఈ దర్శనం కేవలం 25 ఏళ్లలోపు వారికి మాత్రమే ఉంటుందని తెలిపారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శన టికెట్లను పొందిన భక్తులకు మాత్రమే తొలిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్ ద్వారా చేపట్టినట్లుగా వెల్లడించారు. అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని, వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల కొండపై పలు చర్యలు చేపట్టినట్లుగా ఆయన వెల్లడించారు. వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారని, అందరికీ 24 గంటల్లోపే దర్శనం అవుతోందని తెలిపారు.