Nara Lokesh : జగన్ కోడికత్తి వారియర్స్‌లో ఆటగాళ్లు వారే..నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
X
ఏపీ సీఎం జగన్ కోడికత్తి డ్రామా స్పూర్తితో ఓ ఐపీఎల్ టీమ్ పెట్టనున్నారని, ఆ జట్టులో ఉండేవారి పేర్లను టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు. పార్వతిపురంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ..జగన్ ఖేలో ఇండియా కార్యక్రమం పేరును ఆడుదాం ఆంధ్రాగా మార్చారన్నారు. ఏపీ ప్రజల జీవితాలతో జగన్ ఆడుకున్నది చాలని ఆయన విమర్శించారు. కోడికత్తి డ్రామాతో ఫేమస్ అయిన జగన్ తాను పెట్టబోయే ఐపీఎల్ టీమ్ పేరు కోడికత్తి వారియర్స్ అని అన్నారు.
కోడికత్తి వారియర్స్ జట్టులో ఆడే ప్లేయర్స్ పేర్లను కూడా నారా లోకేశ్ ప్రకటించారు. బాబాయ్‌ని పొడిచి చంపిన ఆల్ రౌండర్ అవినాశ్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అయిన అనిల్ యాదవ్, అరగంట స్టార్ అయిన అంబటి రాంబాబు, గంట స్టార్ అయిన అవంతి శ్రీనివాస్, సీనియర్ బ్యాట్స్ మెన్‌గా గోరంట్ల మాదవ్, రీల్స్ స్టార్ మార్గాని భరత్, భూతుల స్టార్ అయిన సన్న బియ్యం సన్నాసి కొడాలి నాని వంటివారు జట్టులో ఉన్నారని విమర్శలు గుప్పించారు.
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొచ్చేందుకు 25 మంది ఎంపీలను గెలిపించండని జగన్ అన్నారని, కానీ ఇప్పుడు లోక్ సభలో 23, రాజ్యసభలో 9 మంది ఎంపీలు ఉన్నట్లు తెలిపారు. వారి వల్ల ఏపీ పరువు మొత్తం పోతోందన్నారు. ఓ ఎంపీ లోక్ సభలో జిప్ తీసి చూపిస్తే, మరో ఎంపీ సీబీఐ వాళ్లు రాగానే కర్నూల్ ఆస్పత్రిల పడుకుంటాడని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాస్తుల్లో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఆయన చేసే అవినీతిని బుక్ రాసుకుని మురిసిపోతుంటాడని అన్నారు. వారంతా ప్రత్యేక హోదా కోసం పోరాడలేదని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.