క్షీణించిన కోడికత్తి శ్రీను ఆరోగ్యం!
X
సీఎం జగన్‌పై దాడి కేసులో విశాఖ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందని విశాఖ దళిత సంఘాల కన్వీర్ బూసి వెంకట్రావు తెలిపారు. జగన్ తమకు న్యాయం చేయాలంటూ శ్రీను జైల్లో దీక్ష చేస్తున్నారు. తాజాగా తాము అతడిని కలిసేందుకు వెళ్లగా అస్వస్ధతతో ఉన్న శ్రీనును ఇద్దరు అధికారులు మోసకొచ్చారని వెంకట్రావు పెర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి శ్రీను నిరాహారదీక్షను కొనసాగిస్తున్నాడని.. అయినప్పటికీ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదని దళిత సంఘాల నేతలు తెలిపారు. జైల్లో శ్రీనుకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందని.. అక్కడి నుంచి శ్రీనును తరలించాలని డిమాండ్ చేశారు.
శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్ అథారిటీలో ఆయన తరపు న్యాయవాది సలీం పిటిషన్ దాఖలు చేశారు. కొడికత్తితో దాడి కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. అందుకు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం అంగీకరించింది. వ్యాజ్యం పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.