పార్టీ హామీలతో జనసేన కార్యకర్త వెడ్డింగ్ ఇన్విటేషన్
గాజు గుర్తుకే ఓటేయాలంటూ పెండ్లి పిలుపు
X
ప్రతి ఒక్కరి వైవాహిక జీవితానికి తొలి సంతకం శుభలేఖ. కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో జరిగే వేడుకకు వివాహ ఆహ్వాన పత్రిక ముద్రించి ఇచ్చి పిలవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి ఆనవాయితీలో భాగంగా ఏపీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఒకరు.. తన పెళ్లి వేడుకకి సంబంధించిన ఆహ్వాన పత్రికను డిఫ్రంట్ స్టైల్‌లో డిజైన్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. తన పెళ్లి పిలుపుతో పాటు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానంతో.. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో.. అన్నీ హామీలు ఆ పత్రికలో పొందుపరిచాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని శిఖబడి గ్రామానికి చెందిన లచ్చిపతుల రంజిత్‌కుమార్ జనసేన కార్యకర్త. ఆయన ప్రస్తుతం ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఆయన వివాహం జరిగింది. ఈ సందర్భంగా పంపిణీ చేసిన ఆహ్వాన పత్రిక కవరుపై పవన్ కల్యాణ్ వారాహి చిత్రంతో ఉన్నట్లు, లోపల పార్టీ ఇచ్చిన హామీలను ప్రచురించి ప్రచారం కల్పించారు.
తమ పెళ్లి కార్డు గురించి నలుగురు మాట్లాడుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఇంతకుముందు కొందరు యువకులు కూడా ఇలాగే వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని మల్యాలకు చెందిన యువకుడు.. తన పెళ్లి పత్రికను తెలంగాణ యాసలో ప్రచురించి .. వెరైటీగా బంధువులను ఆహ్యానించాడు. ఫోక్ సాంగ్స్ రైటర్, సింగర్ గా రాణిస్తున్న పొన్నం మహేష్ గౌడ్ అనే యువకుడు.. తెలంగాణ యాస, భాషకు ప్రత్యేక స్థానం కల్పించే విధంగా తన వివాహానికి సంబంధించిన పెళ్లి పత్రికను తెలంగాణ యాస ఉట్టిపడేలా తయారు చేయించాడు. బెంగుళూరుకు చెందిన సునీల్ అనే మరో యువకుడు.. తన పెళ్లి కార్డును ఓటరు గుర్తింపు కార్డు తరహాలో ఉండేలా ప్లాన్ చేశాడు.చూడగానే ఇది ఓటరు గుర్తింపు కార్డు కదా అన్నట్లుగా ఉండేలా డిజైన్ చేయించాడు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.