Nadendla Manohar : ‘జగనన్న విద్యా కానుకలో భారీ కుంభకోణం’
X
ఏపీలో కుంభకోణాల రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జగన్ ప్రభుత్వం జైలుకు పంపడంతో ఆ పార్టీ, దాని మిత్రపక్షం జనసేన మండిపడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ కొన్ని వివరాలను బయటటపెడుతున్నాయి. జగనన్న విద్యాకానుకలో భారీ కుంభకోణం జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆయన మంగళవారం మంగళగిరిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ఇస్తున్న వస్తుల్లో ఏమాత్రం నాణ్యత లేని ఆయన మండిపడ్డారు. ఈ వస్తువులు అందించడానికి ఐదు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. కాంట్రాక్ట్ వాటికే ఎందుకిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూలు కొన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు పెట్టారు. నిధులను భారీగా దారి మళ్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలింది. రూ.400 కోట్లతో కొన్ని ఫ్లాట్ ప్యానెళ్ల ఉదంతంలోనూ అవినీతి జరిగింది. ఈ అవినీతిని ఆధారాలతో నిరూపిస్తాం. ఇప్పటికేన టోఫెల్, పాలవెల్లువ పథకంలో అవినీతిని బయటపెట్టాం. నాడు-నేడు పథకం కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. రూ. 6 వేల కోట్లు గ్రాంట్ వస్తే రూ.3,550 కోట్లే ఖర్చు చేసింది. మిగతా సొమ్ము ఎక్కడికి వెళ్లింది’’ అని నాదెండ్ల ప్రశ్నించారు.