Pawan Kalyan : ఏపీకి తెగులు సోకింది, మేమే సరైన్ వ్యాక్సీన్.. పవన్
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా జైలుకు పంపి, సాంకేతిక కారణాలతో బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు వ్యవస్థపై భరోసా కల్పించేందుకే టీడీపీ, జనసేనలు జట్టుకట్టాయన్నారు. ఆయన సోమవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న తర్వాత విలేకర్లతో మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపి తీరాలి. మన రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు సోకింది. దాన్ని నిర్మూలించాలంటే టీడీపీ- జనసేన అనే వ్యాక్సిన్ వేయాలి. రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరమని భావించే 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చాం. ఇప్పుడు కూడా ఆయనకు మద్దతిచ్చేందుకే సమావేశం అయ్యాం. రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై చర్చించాం’’ అని పవన్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని, ఏపీ అభివృద్ధే తమ పార్టీ ఆశయమని చెప్పారు.
విలేకర్ల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ తమ పొత్తు రాష్ట్ర ప్రయోజనాలకే అని చెప్పారు. జగన్ ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతోందని, ఎస్సీలకు సంబంధించిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. ఏపీకి నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, యువతకు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. నవంబర్ 1న టీడీపీ, జనసేల ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన ప్రకించారు.