Home > ఆంధ్రప్రదేశ్ > నియోజకవర్గం ఫిక్స్.. జనసేనాని పోటీ అక్కడి నుంచేనా..?

నియోజకవర్గం ఫిక్స్.. జనసేనాని పోటీ అక్కడి నుంచేనా..?

నియోజకవర్గం ఫిక్స్.. జనసేనాని పోటీ అక్కడి నుంచేనా..?
X

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఏపీ అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. ఈసారి కచ్చితంగా గెలిచే నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరు నియోజకవర్గాల్లో సర్వే చేయించిన .. ఓ స్థానాన్ని ఫైనల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలోలాగే ఈసారి కూడా జనసేనాని రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది.

తూగో జిల్లాపై ఫోకస్

పవన్ కల్యాణ్ ఇటీవలే పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందన్న అంశాలపై సర్వే చేయించారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. గతంలో తాను పోటీ చేసి ఓటమి పాలైన భీమవరం కూడా ఇందులో ఒకటి. ఇటీవల పవన్ కల్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్రలో ఆయన తాను పోటీ చేసే నియోజకవర్గంపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి రావాలంటే తూర్పు గోదావరి డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో తాను అక్కడి నుంచే బరిలో దిగాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పిఠాపురం నుంచి పోటీ..?

జనసేనాని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయటం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన పిఠాపరం వారాహి యాత్ర సభలోనూ పరోక్షంగా ఇవే సంకేతాలిచ్చారు. పిఠాపురంలో కొత్తగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా ఇల్లు కట్టుకుంటానని పవన్ ప్రకటించారు. సర్వే ఆధారంగానే ఆయన ఈ నియోజకవర్గం వైపు మొగ్గుచూపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసినా అది కలిసిరాకపోవడంతో ఈ సారి తూర్పు గోదావరి నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు సమాచారం.

ద్వారంపూడి సవాల్

ఇదిలా ఉంటే వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ స్పందించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేనానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొలిటికల్ గా జీరో అయిన పవన్ కల్యాణ్.. అజెండా ఏమిటో, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి 14న తనకు సీఎం అయ్యే అర్హత లేదన్న ఆయన.. సరిగ్గా 3నెలల తర్వాత జూన్ 14న నిర్వహించిన కత్తిపూడ సభలో తనను ముఖ్యమంత్రిని చేయాలని మాటమార్చారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలను పవన్ నిరూపించాలన్న చంద్రశేఖర్.. కాకినాడలో తనను ఓడించడం పవన్ వల్ల కాదని అన్నారు. తనను ఓడిస్తానని ఆయన చేసిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని, దమ్ముంటే పవన్ కాకినాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ పవన్ పోటీ చేస్తే ఆయనను తుక్కుతుక్కుగా ఓడిస్తానని అన్నారు.

Updated : 19 Jun 2023 1:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top