Home > ఆంధ్రప్రదేశ్ > సీఐ ఆత్మహత్యపై రాజకీయం.. జేసీ వర్సెస్ కేతిరెడ్డి

సీఐ ఆత్మహత్యపై రాజకీయం.. జేసీ వర్సెస్ కేతిరెడ్డి

సీఐ ఆత్మహత్యపై రాజకీయం.. జేసీ వర్సెస్ కేతిరెడ్డి
X

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాజకీయ ఒత్తిళ్ళతోనే సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టాలని సీఐ ఆనందరావుపై ఒత్తిళ్లు పెరిగాయని ఆయన అన్నారు. సీఐ ఆనందరావు చాలా సౌమ్యుడని, ఆయన మృతి చాలా బాధాకరమన్నారు.

కేతిరెడ్డికి ఈ గోడు తగులుతుంది

స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) ఒత్తిడి వల్లే సీఐ చనిపోయారని.. కేతిరెడ్డికి ఈ గోడు తగులుతుందన్నారు. ఏదైనా అంటే సజ్జల ఫోన్ చేసి పోలీసులపై ఒత్తిడి చేస్తారని.. ఇలాగైతే తాడిపత్రిలో పనిచేయటానికి ఎవరు రారన్నారు. ఆదివారం మధ్యాహ్నం డీఎస్పీ ఆఫీస్‌కి సీఐ ఆనందరావు వెళ్లాడన్నారు. సీఐ ఎవరెవరిని కలిశాడో విచారణ జరిగిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

నీ బ్రతుకు అంతా తెలుసు

జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని.. కుటుంబ కలహాలతో సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

నిన్న రాత్రి వాగ్వాదం

సీఐ ఆనందరావు.. తాడిపత్రిలోని అద్దె ఇంట్లో సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కొంతకాలంగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబసభ్యుల వాదన. అయితే కొంతకాలంగా భార్యతో సీఐకు గొడవలు జరుగుతన్నట్లు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఆనందరావు సొంత ఊరు చిత్తూరు జిల్లా చంద్రగిరి కాగా.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.




Updated : 3 July 2023 11:37 AM IST
Tags:    
Next Story
Share it
Top