పవన్.. ప్యాకేజీ స్టార్ అని ఎందుకు తిట్టించుకుంటావ్ - కేఏ పాల్
X
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేఏ పాల్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దీక్ష కంటిన్యూ చేస్తానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా వెనకడుగువేసే ప్రసక్తేలేదన్న చెప్పారు. దీక్ష చేస్తున్న పాల్కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను బలవంతంగా హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే దీక్ష సందర్భంగా కేఏ పాల్ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అడుక్కునే బతుకెందుకని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇకపై మాట్లాడనని పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పిన మాటల్ని కేఏ పాల్ గుర్తుచేశారు. అందుకే ఆయన ఫ్యాన్స్ అంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. అలా చేస్తే పవన్ కల్యాణ్ మోడీ, చంద్రబాబు, లోకేష్ జెండాలు మోయకుండా ఉంటారని హితవుపలికారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే ఇప్పుడు పవన్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని పాల్ విమర్శించారు.
పవన్ ను అందరూ ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్నారని, అలా ఎందుకు అనిపించుకుంటావని కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ అడుక్కునే బతకు మనకెందుకని అన్నారు. బీజేపీని గెలిపించమని పవన్ 100 జన్మలు ఎత్తినా ప్రజలు ఓటు వేయరన్న ఆయన.. అసలు అలాంటి వాళ్లు మనకెందుకని నిలదీశారు. పవన్ కల్యాణ్ జనసేనను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేస్తే ఆయనను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తానని పాల్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ హాలీవుడ్ రేంజ్ లో ఫిల్మ్ బిజినెస్ చేసుకుంటే తాను రియల్ హీరోగా పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2023
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రజా శాంతి పార్టీలో చేరిపోండి. పవన్ .. నిన్ను ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్నారు. ఈ అడుక్కునే బతుకు మనకు అవసరమా. నువ్వు బీజేపీని గెలిపించమని 100 జన్మలు ఎత్తినా ఓటు వేయరు. పవన్ నిన్ను… pic.twitter.com/hz03IzPElU