KA Paul : విశాఖ టెస్టు మ్యాచ్‌లో సందడి చేసిన కేఏ పాల్
X
విశాఖ టెస్టు మ్యాచ్ సందర్బంగా స్టేడియంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సందడి చేశారు. వైజాగ్‌లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుండగా మ్యాచ్ చూడ్డానికి పాల్ వచ్చాడు. ఆయన తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ పార్లమెంట్ నుంచి పోటి చేస్తుండడంతో తనను కూడా క్రికెట్ మ్యాచ్ కు ఆహ్వానించారని కేఏ పాల్ తెలిపారు. భారత్ క్రికెట్ లోనే నెంబర్ వన్ అని, ఇతర క్రీడల్లో వెనుకబడి ఉందని అన్నారు. చైనా, అమెరికా, రష్యా స్థాయికి ఇండియా ఎదగాలని ఆకాంక్షించారు. 100 క్రీడాంశాల్లో భారత్ ను నెంబర్ వన్ గా చేసే బాధ్యత తనది అని కేఏ పాల్ ప్రకటించారు.క్రీడల దిశగా యువతను ప్రోత్సహించాలని, అందుకోసం వేల కోట్లు నిధులు కేటాయించాలని అన్నారు.
ఇక, విశాఖను లాస్ ఏంజెలిస్, దుబాయ్ తరహాలో ఇంటర్నేషనల్ సిటీగా మార్చేద్దామని, అందుకోసం తనను ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. రెండవ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 67/1 పరుగుల వద్ద ఆటకు తెరపడింది. ముగింపు సమయానికి క్రాలే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ (28) వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి డకెట్ వెనుదిరిగాడు. మూడవ రోజు ఆటలో శుభ్‌మాన్ గిల్ (104) సెంచరీ నమోదు చేశాడు. గిల్ ఈ కీలక ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 29, అక్షర్ పటేల్ 45, రవిచంద్రన్ అశ్విన్ 29 రన్స్ చేశారు.