టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా.. పవన్తోనే నా ప్రయాణం : మాజీ మంత్రి
X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల దగ్గరపడుతున్నా కొద్దీ నేతల జంపింగ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టగా.. కేశినేని నాని వంటి టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఇక గత కొన్నాళ్లుగా అన్నీ పార్టీలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణ తన రాజకీయ భవిష్యత్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్తో సమావేశమైన ఆయన.. ఇవాళ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా ఆయన వెంటే ఉంటానని కొణతాల స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. దానిని అంతమొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ అభివృద్ధిపై పవన్కు స్పష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు. కాగా 2014లో వైసీపీకి కొణతాల రాజీనామా చేశారు. అప్పటినుంచి ఏ పార్టీలోనూ చేరలేదు. గతంలో వైఎస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జనసేన నుంచి అనకాపల్లి టికెట్ ఆశిస్తున్నారు.
కొణతాల జనసేనలో చేరికపై పవన్ కల్యాణ్ స్పందించారు. కొణతాల జనసేనలో చేరుతానని ప్రకటించడం హర్షణీయమన్నారు. సుదీర్ఘ కాలంగా ప్రజాజీవితంలో ఉన్న ఆయన.. తమ పార్టీలోకి రావడం శుభపరిణాం అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఎంతో స్పష్టత ఉంది. పార్టీ బలోపేతానికి కొణతాల సేవలు ఎంతో ఉపయోగం అని పవన్ స్పష్టం చేశారు.