ఆహ్వానం అందలేదంటూ రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ
X
టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్ధం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రూ.100 రూపాయల ప్రత్యేక నాణెం విడుదలలో చిన్న ట్విస్ట్ నెలకొంది. ఎన్టీఆర్ పేరిట నాణెం విడుదల చేయాలనుకోవడం సంతోషమే అయినా.. ఆయన భార్య అయిన తనను ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం దురదృష్టకరం అన్నారు తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. తనను కాదని, చంద్రబాబు సహా ఇతర కుటుంబ సభ్యుల్ని ఆ కార్యక్రమానికి పిలవడం సరికాదన్నారు. ఈమేరకు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈనెల 28న ఎన్టీఆర్ పేరిట విడుదల చేస్తున్న నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తనను కూడా ఆహ్వానించాలని కోరారు.
ఎన్టీఆర్ భార్యగా తానే అసలైన వారసురాలినని లక్ష్మీపార్వతి లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్టీ రామారావు పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ఆమె కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తదితర కుటుంబ సభ్యుల వల్ల ఎన్టీఆర్ చనిపోయారని.. అలాంటి వ్యక్తులను నాణెం విడుదల కార్యక్రమానికి పిలవడంపై లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తో తన పరిచయం, వివాహం, తానంటే గిట్టని చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, ఆయకు అధికారం దూరం చేసి, మానసిక క్షోభతో ఆయన మరణానికి కారణం అయిన వారిని ఆ కార్యక్రమానికి ఎలా పిలుస్తారంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం ఈ నెల 28న ఢిల్లీకి తరలివెళ్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ పిలిచే బాధ్యతను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎన్టీఆర్ కుటుంబంలో కొడుకులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు ఈ నెల 27 సాయంత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు 28న ఉదయం ఢిల్లీకి చేరుకొంటున్నారు.