Tirumala : తిరుమలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం
X
తిరుమలలో మరోసారి కలకలం రేగింది. అలిపిరి మెట్లమార్గంలో చిరుత, ఎలుగుబంటి సంచారం ఆందోళన కలిగిస్తోంది. నడకదారిలోని శ్రీ నరసింహ స్వామి వారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీల్లో చిరుత, ఎలుగు కదలికలను అధికారులు గుర్తించారు. వన్య మృగాల సంచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమయింది. నడకమార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులను అలర్ట్ చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.
గతంలో అలిపిరి నడకదారి మార్గంలో చిరుత ఓ బాలుడిపై దాడి చేయగా.. మరో చిరుత నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బాలికను చంపేసింది.. దీంతో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులతో కలిసి బోన్లు ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించింది. చిరుతల బెడద తప్పిపోయిందని టీటీడీ, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్లు గుర్తించడంతో వారిలో ఆందోళన మొదలైంది.
తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భక్తుల్ని అనుమతించడం లేదు.. దీంతో పాటు 12 ఏళ్లలోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడక మార్గంలో అనుమతించడం లేదు. చిరుతల నుంచి రక్షణ కోసం భక్తులకు ఊత కర్రల్ని పంపిణీ చేయడంతో పాటు కొంతమంది గార్డుల్ని నియమించారు.