Voter List : ఓటర్ల జాబితాలో లోపాలు.. జగన్ కుటుంబానికీ తప్పలేదు!
X
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్చారని వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.
రోజురోజుకూ ఓటర్ల జాబితాలోని తప్పుల సమాచారం వెలుగుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా సాక్షాత్తూ సీఎం జగన్ కుటుంబ సభ్యుల వివరాలు కూడా తప్పుగా ఉండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని 138వ పోలింగ్ కేంద్రంలో సీఎం జగన్, ఆయన కుటుంబీకుల ఓట్లు ఉన్నాయి.
ఓటర్ల జాబితాలో జగన్ పెద్దమ్మగా ఆయన భార్య వైఎస్ భారతి పేరును చేర్చారు. జగన్ పెద్దమ్మ పేరు వైఎస్ భారతమ్మ. కానీ ఓటర్ల జాబితాలో వైఎస్ భారతి అని ముద్రించారు. అంతేకాకుండా ఆమె భర్త పేరు జార్జ్ రెడ్డిని తప్పుగా చూపారు. అలాగే ఆమె వయసు కూడా 60 సంవత్సరాలని ముద్రించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాక్షాత్తూ సీఎం కుటుంబీకుల వివరాల్లోనే ఇలాంటి తప్పులుంటే ఇక రాష్ట్రంలోని ఓటర్ల పరిస్థితి ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.