లోకో పైలట్ సమయస్ఫూర్తి..తృటిలో తప్పిన పెను ప్రమాదం
X
విశాఖలో పెను ప్రమాదం తప్పింది. షీలానగర్‌లో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఓ కారు అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగిపోయింది. టెక్నికల్ ఇష్యూల కారణంగా ఎంత స్టార్ట్ చేసినా కారు ముందుకు కదలలేకపోయింది. అదే టైంలో ట్రాకపై వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ కారు ఆగడం చూసి అప్రమత్తమయ్యారు. తన సమయస్ఫూర్తిని ఉపయోగించి కారులో ఉన్న వారిని ప్రమాదం నుంచి తప్పించారు.
గాజువాక పరిధిలోని ములగాడ నుంచి ఓ కారు విశాఖ సిటీ లోపలికి వచ్చింది. షీలానగర్‌లోని ఓ రైల్వే ట్రాక్ దాటుతుండగా కారు అకస్మాత్తుగా టెక్నికల్ కారణాలతో ట్రాక్‌పైన ఆగిపోయింది. అదే సమయంలో అదే ట్రాక్‌పై గూడ్స్ రైలు ఎదురుగా వస్తుండటంతో కారులోని వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పట్టాలపై కారు ఆగిపోవడాన్ని గమనించిన గూడ్స్ రైలు లోకో పైలట్ తన సమయస్ఫూర్తిని ఉపయోగించారు. వెంటనే రైలు వేగాన్ని తగ్గించి నడపడం ప్రారంభించాడు. గూడ్స్ రైలు స్లో చేసినా స్వల్పంగా కారును ఢీకొట్టడంతో కారులో కొంతభాగం నుజ్జునుజ్జైంది.
ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వెంటనే కారు దిగి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు. ట్రైన్ స్పీడును కనుక లోకో పైలట్ తగ్గించకపోయుంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.