Amit Shah-Lokesh: చంద్రబాబు అరెస్ట్.. అమిత్ షా, లోకేశ్ కీలక భేటీ
X
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు వివరించినట్లు చెప్పుకొచ్చారు. గురువారం ఢిల్లీలో మిడియాతో మాట్లాడిన లోకేశ్.. భేటీలో చర్చించిన విషయాల గురించి తెలిపారు. ‘అమిత్ షా నన్ను కలవాలనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో జరిగిన పరిణామాలపై అమిత్ షాకు వివరించా’ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారని, జైలులో భద్రతపై తమకు ఆందోళనగా ఉందని అమిత్ షాతో వివరించారు లోకేశ్.
సీఐడీ తనను ఎందుకు పిలిచింది? ఎన్నికేసులు పెట్టారని అమిత్ షా అడగగా, రాజకీయ కక్షతోనే ఇబ్బంది పెడుతున్నారని చెప్పినట్లు లోకేశ్ వివరించారు. కిషన్ రెడ్డి సలహాతోనే అమిత్ షాను కలిసానని లోకేశ్ చెప్పారు. చంద్రబాబుపై జరుగుతున్న కుట్రను, బీజేపీనే దగ్గరుండి చేయిస్తుంది అని ఓ ఏపీ ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్లు తెలిపారు. ఈ విషయంపై బీజేపీ తప్పులేదని, ఏపీ బీజేపీ నేతల మౌనం వల్లే ఈ ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ అభిప్రాయపడ్డారు. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరినట్లు లోకేశ్ చెప్పుకొచ్చారు.
బీజేపీపై జగన్ నిందలు:
ఏపీలో బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని స్పష్టం చేశారు. అనవసరంగా బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కాగా ఈ భేటీలో.. ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చకు రాలేదని లోకేశ్ స్పష్టం చేశారు.