వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి మచిలీపట్నం ఎంపీ
X
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల జంపింగ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లగా.. తాజాగా ఓ ఎంపీ అదే లిస్ట్లో చేరారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఇవాళ తన రాజకీయా భవిష్యత్పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జనసేన పార్టీలో చేరతానని చెప్పారు. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ను కలిసి వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిపై పవన్కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి..రైతులకు సాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు.
వైసీపీ తీరుపై బాలశౌకి గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి జోగి రమేష్లతో ఆయనకు విబేధాలు ఉన్నాయి. వీటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని బాలశౌరి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని.. ఇలానే ఉంటే తన రాజకీయ భవిష్యత్ కష్టమవుతోందంటూ వైసీపీకీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పవన్తో భేటీ అయిన ఆయన వివిధ అంశాలపై చర్చించారు. త్వరలోనే మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ పెట్టి.. ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.