Home > ఆంధ్రప్రదేశ్ > Manappuram Gold Loan Company: పక్కా స్కెచ్.. రూ.6కోట్ల నగలతో మణప్పురం ఉద్యోగిని పరారీ

Manappuram Gold Loan Company: పక్కా స్కెచ్.. రూ.6కోట్ల నగలతో మణప్పురం ఉద్యోగిని పరారీ

Manappuram Gold Loan Company: పక్కా స్కెచ్.. రూ.6కోట్ల నగలతో మణప్పురం ఉద్యోగిని పరారీ
X

ఏపీలోని కృష్ణా జిల్లాలో చోరీ జరిగింది. కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్‌ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్‌ హెడ్‌ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్‌ఐ కె.సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్‌ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు.

సోమవారం రాత్రి పావని విధులు ముగించుకుని వెళ్లారు. మంగళవారం విధులకు హాజరుకాలేదు. ఇక అదే రోజు కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు.

బ్రాంచిలో సీసీ కెమెరాలు రెండు నెలలుగా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. పావని, మరో వ్యక్తి కలిసి బ్యాగుతో కారులో వెళ్లినట్లుగా స్థానిక లాకు రోడ్డులోని సీసీ కెమెరా ఫుటేజీలో ఉంది. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్‌గేట్‌ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.

Updated : 19 Oct 2023 4:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top