CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలోని మెడికల్ కాలేజీలకు వైఎస్సార్ పేరు
X
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 17 మెడికల్ కాలేజీలకు డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ కళాశాలలుగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగం బలోపేతానికి వైఎస్సార్ విశేషంగా కృషి చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్యశ్రీ, వైద్య కళాశాలల ఏర్పాటు 108, 104 వాహనల వ్యవస్ధతో విప్లవ మార్పులు తీసుకొచ్చారని తెలిపింది. గతంలో జగన్ సర్కారు విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుగా ఏపీ ప్రభుత్వం మార్చింది. ఈ చర్య ప్రధాన ప్రతిపక్షం, టీడీపీ వైద్యులు స్థానిక ప్రజల నుండి నిరసనలకు దారితీసింది .హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు మార్చేశారు. ఏదైనా సంస్థకు లేదా నిర్మాణానికి భారీగా విరాళం ఇస్తేనో.. భూములు దానంగా ఇస్తేనో వారి పేర్లు పెడతారు.
కానీ, ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతో నిర్మిస్తున్న కళాశాలలకు సీఎం జగన్.. సొంత ఆస్తుల్లా తన తండ్రి వైఎస్ పేరు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా 17 వైద్య కళాశాలలకు ఆయన పేరుపెట్టారు. నిజానికి పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీకి కేంద్రం నిధులు ఇస్తున్నా ప్రధాని మోదీ ఫొటో కూడా పెట్టకపోవడం ఏమిటని ఇటీవల కేంద్రమంత్రి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 1,500 కోట్ల నిధులు ఆపేస్తామని కేంద్రం హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని చిత్రం, కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన చిహ్నాన్ని పెట్టింది. తాజాగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కళాశాలలకు వైఎస్ నామకరణం చేసింది. పేదల జీవితాలు, ఆరోగ్య సంరక్షణ రంగానికి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని వైసీపీ నేతలు అంటున్నారు.పేదలకు వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజారోగ్య సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు.