పవన్‌పై మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రస్తుతం విశాఖలో కొనసాగుతోంది. గురువారం జగదాంబ సెంటర్ సభలో మాట్లాడిన జనసేనాని వైసీపీ, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం డబ్బు మనిషి అని, కొండలు, గుట్టలు తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను దోచేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంతో కలిసి ఏదో ఒక రోజు సీఎంను ఆటాడిస్తానని పవన్ హెచ్చరించారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని తెలిపారు. స్టీల్
ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని మంత్రి నిలదీశారు. తమపై ఫిర్యాదు చేయడానికి ఏముందని ప్రశ్నించారు. జగన్ సర్కారు ఎవరికీ భయపడబోదని స్పష్టం చేశారు. కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు కానీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూసెటైర్లు వేశారు.
పవన్ అమాయకుడని, చూస్తే జాలేస్తుందని మంత్రి ఎద్దేవ చేశారు. వారాహి అనే లారీ ఎక్కి కేవలం ముఖ్యమంత్రిని తిట్టడమే తప్ప అతడికి దేనిమీద అవగాహన లేదని చెప్పారు. స్థిరత్వం, సిద్ధాంతం లేని నాయకుడు పవన్ కల్యాణ్ అని..బీజేపీతో సంసారం, టీడీపీతో సహజీవనం చేస్తున్నాడని మంత్రి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో పోటీ ప్రణాళిక పవన్ లో కనిపించలేదన్నారు. సినిమాల్లో కథానాయకుడుగా మీ తీరు బాగుండొచ్చు కానీ.. రాజకీయాల్లో తగదని సూచించారు.