CM Jagan : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
X
ప్రభుత్వ ఉద్యోగలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చిలోగా బకాయిలను చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారయణ తెలిపారు. ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం మాట్లాడిన ఆయన త్వరలో పూర్తిస్థాయిలో పీఆర్సీని ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తామని ఆయన అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అటు ఉద్యోగులు సర్కార్ తమ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు తెలిపారు. ఈ నెల 27న ఛలో విజయవాడ కార్యక్రమం యదాతథంగా నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. కార్యక్రమానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలు ఏపీ ఎన్జీజీవో, రెవెన్యూ ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు.
పీఆర్సీ (PRC) బకాయిలు, పెండింగ్ డీఏలు, కొత్త పీఆర్సీలో భాగంగా మధ్యంతర భృతి ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇస్తామని ఏపి జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందని అన్నారు. 12 పీఆర్సీనీ జూలై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారని తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. తాము చేసిన డిమాండ్ ల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. 10 వేల మందిని క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు పై పునరాలోచన చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు.