ప్రమాదంలో ఏపీ వాళ్లెవరూ చనిపోలేదు - మంత్రి బొత్స
X
కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. సహాయకచర్యలపై మంత్రులు బొత్స సత్యనారాయణ అధికారులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగినట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారితో పాటు చనిపోయిన వారి మృతదేహాలను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి అమర్నాథ్ తో పాటు ముగ్గురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశా పంపినట్లు ప్రకటించారు.
ఏపీకి చెందిన 482 మంది
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టు బొత్స ప్రకటించారు. వీరిలో 309 మంది విశాఖపట్నంలో దిగాల్సి ఉండగా.. రాజమండ్రిలో 31, ఏలూరులో ఐదుగురు, విజయవాడలో 137 మంది దిగాల్సి ఉందని అన్నారు. వీరందరి ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 482 మందిలో 267 మంది సురక్షితంగా ఉన్నారని, 20 మందికి స్వల్పంగా గాయాలైనట్లు గుర్తించామని అన్నారు. మిగతా వారిలో 82 మంది ప్రయాణం రద్దు చేసుకోగా.. 113 మంది ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం లేదా స్విచ్ఛాప్ వస్తున్నాయని అన్నారు. ఆ 113 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో ఇప్పటి వరకు ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం అందలేదని బొత్స స్పష్టం చేశారు.
హౌరాలో ట్రైనులో 89 మంది
ఇక హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు గుర్తించారు. వారిలో 33 మంది విశాఖపట్నం, ముగ్గురు రాజమండ్రి, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 మంది ఉన్నారు. వారిలో 49 మంది సురక్షితంగా ఉండగా ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. 10 మంది ట్రైను ఎక్కలేదని, 28 మంది ఫోన్లు స్విచాఫ్ అయినట్లు మంత్రి ప్రకటించారు.
హాస్పిటళ్లు సిద్ధం
సీఎం జగన్ ఆదేశాలు మేరకు ఇచ్చాపురం నుంచి రాష్ట్ర సరిహద్దులోని అన్ని హాస్పిటల్స్ను సిద్ధం చేయడంతో పాటు అన్ని కలెక్టరేట్లలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స చెప్పారు. ఏపీ నుంచి వైద్యుల బృందంతో పాటు 65 అంబులెన్సులు పంపించామని అన్నారు. ఎయిర్ పోర్టులో ఓ చాపర్‌ను సైతం సిద్ధంగా ఉంచామని, అవసరం అనుకుంటే నేవీ హెల్ప్ కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.