Minister Roja : నాకు టికెట్ ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తున్నారు.. మంత్రి రోజా
X
ఏపీ మంత్రి రోజా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవ చేసే శక్తి వస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీకి 175 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి ఎవరైనా బయటికి పోతే వారిని లాక్కొని సీట్లు ఇవ్వాలని గోతికాడ గుంటనక్కల్లా కాచుకొని ఉన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గంలో మళ్లీ పోటీచేసే విషయంపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నగరి నియోజకవర్గంలో తనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని మంత్రి రోజా అన్నారు. నగరిలో తనకు సీటు ఇవ్వకుంటే ఆ రెండు పత్రికల యాజమానులకు ఇస్తారా? అంటూ విమర్శించారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా’’ అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని రోజా దీమా వ్యక్తంచేశారు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో జగన్ మోహన్ రెడ్డి ఇన్ ఛార్జిల మార్పులు చేర్పులు చేశారు. మరో జాబితాకూడా సిద్ధమవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా, కుప్పం మినహా మిగిలిన 13 చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా సాగుతుంది.