మనసు గాయపడింది.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తా : వైసీపీ ఎమ్మెల్యే
X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాకొద్దీ నేతల జంపింగ్లతో రాజకీయం రంజుగా నడుస్తోంది. వైసీపీ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. పలువురు అభ్యర్థులను వేరే స్థానాలకు మార్చడం, మరికొందరికి మొండిచేయి చూపిస్తుండడంతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కారు. తనకు తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో మనసు గాయపడిందని ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు.. ఒక ఎంపీ మాటలు విని సీటు ఇవ్వలేడం లేదని రక్షణ నిధి ఆరోపించారు. సీటు ఇవ్వడం లేదనే విషయంపై 20రోజుల క్రితమే సమాచారం వచ్చిందని.. అప్పటినుంచే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఏది ఏమైనా ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గత పదేళ్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లను ఎప్పుడూ విమర్శించలేదని.. అందుకే టికెట్ ఇవ్వలేదేమో అని వ్యాఖ్యానించారు.