వాలంటీర్‌కు ఉన్న అధికారం ఎమ్మెల్యేలకు లేదు : ఆనం
X
వైసీపీ సర్కార్‌పై ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అధికారం లేదని ఆరోపించారు. గ్రామ సర్పంచ్‌ది అదే పరిస్థితి అన్నారు. చివరికి ఓ గ్రామ వాలంటీర్‌కు ఉన్న అధికారం కూడా ఎమ్మెల్యేకి లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నుంచి గ్రామపంచాయతీ సమావేశాల వరకు దేనికీ విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలన అంతమొందించడానికి అందరూ కలిసి రావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
"పోలవరం ప్రాజెక్టు కట్టలేమని నిలిపివేశారు. పవర్ ప్రాజెక్టులు అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ప్రారంభానికి ముందే అమ్మకం టెండర్లు పిలుస్తున్నారు.
కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు టెండర్లు పిలిచారు. ఇవాళ . ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు" అని ఆనం తెలిపారు.
ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులు తెస్తున్నారని..ఆ లెక్కన ఎంత అప్పువతుందని ప్రశ్నించారు. ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్లు కనిపించడం లేదన్నారు. లే అవుట్, బిల్డింగ్ కట్టినా వాళ్లు తెలంగాణలో వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. అక్కడి ప్రభుత్వం వారికి అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు. ఏపీ నుంచి హైదరాబద్ వెళ్లినవారు అప్పట్లో కోడిపందాలకైనా వచ్చేవారు, ఇప్పుడు ఆ కోడిపందాలకు కూడా రావడంలేదు" అని ఆనం వివరించారు.