Vasantha Krishna Prasad : వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే
X
వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబే రావాలని కృష్ణా ప్రసాద్ అన్నారు. చంద్రబాబు సీఎం కావాలన్నదే తన కోరిక అని చెప్పారు. వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని.. నియోజకవర్గ అభివృద్ధికి జగన్ సరైన నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా వసంత కృష్ణ ప్రసాద్ గత కొంత కాలంగా వైసీపీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్గా తిరుపతి యాదవ్‌ను జగన్ నియమించారు. అప్పటి నుంచి ఆ పార్టీకి కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్షాలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని.. చంద్రబాబు, లోకేష్ ను తిట్టాలని జగన్ చెప్పారని అప్పట్లో ఆయన ఆరోపించారు. అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కూడా త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నారు.