Magunta Sreenivasulu Reddy : జగన్కు షాక్.. వైసీపీని వీడిన మరో ఎంపీ
X
ఏపీ సీఎం జగన్కు మరో ఎంపీ షాక్ ఇచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడారు. అనివార్య కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీని వీడడం బాధగా ఉన్నప్పటికీ.. తప్పడం లేదని చెప్పారు. తన కొడుకు రాఘవ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అంటే ఒక బ్రాండ్ అని.. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. తమ కుటుంబానికి ఆత్మగౌరవం తప్ప అహం లేదన్నారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పారు.
మాగుంట మరోసారి ఒంగోలు నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే జగన్ మళ్లీ టికెట్ ఇచ్చేందుకు ససేమీరా అన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంటకు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ జగన్ మాత్రం టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరుతారన్నది చెప్పలేదు. మాగుంటతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. ఇంతకుముందు వల్లభనేని బాలశౌరి,సంజీవ్‌కుమార్, శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు.