కేసీఆర్‌కు జగన్ ద్రోహం...ఎంపీ రఘురామరాజు సంచలన ఆరోపణలు
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడానికి.. వైఎస్ వివేకా హత్య కేసుకు లింక్ ఉందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
కేసీఆర్‌కు మోసం..
శరత్ చంద్రారెడ్డి మద్యం కేసులో కొందరి పాత్రను వెల్లడిస్తే.. వివేకా కేసులో ఓ కీలక వ్యక్తి పేరు బయటకురాకుండా చూస్తామని కొందరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయన్నారు. "కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాత్ర ఉన్నట్లుగా సీఎం జగన్ సొంత పత్రికలో వార్తలు వచ్చాయి. అదే విధంగా శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతున్నట్లు కూడా కథనాలు కనిపించాయి. జగన్‌కు అత్యంత సన్నిహితుడు, విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్ర అప్రూవర్‌గా మారడం వెనుకు చాలా పెద్ద ప్లాన్ ఉంది. ఇదంతా చూస్తే గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన కేసీఆర్‌కు సీఎం జగన్ మోసం చేసేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది" అని రఘురామరాజు స్పష్టం చేశారు.