Nara Lokesh : జగన్ సర్కార్ పై మండిపడ్డ నారా లోకేశ్
X
వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. ఈ మేరకు విజయనగరంలో పర్యటించిన ఆయన నెలిమర్లలో ఏర్పాటు చేసిన శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ చొక్కా మడతపెడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. జగన్ చొక్కా మడత పెడితే..మేం కూర్చీలు మడత పెడతామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ జోలికి వస్తే జగన్ కు సీటు ఉండదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులకు యాత్ర సినిమా కావాలి కాని..రాజధాని ఫైల్స్ వద్దంటా అని ఎద్దేవా చేశారు. వైసీపీ శ్రేణులు రాజధాని ఫైల్స్ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ఫైల్స్ సినిమా, రైతులను చూస్తే జగన్ కు భయమేస్తుందని విమర్శించారు. ఇప్పుడు
మూడు రాజధానుల పేరుతో దొంగ నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ సాక్షి క్యాలెండర్ తప్ప...జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ ఏ పథకం తెచ్చిన అందులో ఓ స్కామ్ ఉంటుందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే జగన్ అవినీతిపై విచారణ చేపడతామని చెప్పారు. వైసీపీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తేల్చి చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ శ్రేణులంతా బ్లేడ్ బ్యాచేనని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు కడుతున్న ఇండ్లు చేత్తో తోసేస్తే పడిపోతాయని ఆరోపించారు. చంద్రబాబు అంటే పోలవరమని...జగన్ అంటే పిల్ల కాలువ అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.