నారా లోకేశ్ శంఖారావం యాత్ర.. వారే టార్గెట్
X
ఏపీలో రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రను చేపట్టనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రం ఆయన విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌కు విశాఖలో ఘన స్వాగతం లభించింది. రేపు ఇచ్చాపురంలో లోకేశ్ చేపట్టే శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు లోకేశ్ యాత్రకు భారీగా తరలిరానున్నారు. రేపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఉదయం 10.30 గంటలకు లోకేశ్ శంఖారావం యాత్రను చేపట్టనున్నారు.
గతంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర ఉత్తరాంధ్రలో పూర్తిగా జరగకుండానే ముగిసిపోయింది. ఆ యువగళం యాత్ర లోటును శంఖారావం యాత్ర ద్వారా భర్తీ చేసేందుకు నారా లోకేశ్ ఎదురుచూస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు ఆ శంఖారావం యాత్ర సాగనుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలనే టార్గెట్‌గా చేసుకుని వాటిని వివరిస్తూ, అలాగే చంద్రబాబు హయాంలో జరిగిన మంచి పనులను చెబుతూ లోకేశ్ తన యాత్రను కొనసాగించనున్నారు.
ఈ యాత్రలో భాగంగా మొత్తం 31 నియోజకవర్గాల కేడర్‌తో లోకేశ్ సమావేశం కానున్నారు. ఎన్నికల తరుణంలో టీడీపీ కార్యకర్తలకు లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు లోకేశ్ చేపట్టబోయే యాత్ర ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో సాగనుందని, అలాగే టీడీపీ కార్యకర్తలతో కూడా అక్కడక్కడా సమావేశాలు, చర్చలు ఉంటాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా టీడీపీకి ఈ యాత్ర ఎంతో కీలకం కానుంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.