Nara Lokesh : భయం టీడీపీ బయోడేటాలోనే లేదు..జగన్‌కు నారా లోకేశ్ సవాల్
X
భయం టీడీపీ బయోడేటాలోనే లేదని, ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని, మరి జగన్ సిద్ధమా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శంఖారావం సభను నిర్వహించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ..ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తనపై 22 కేసులు పెట్టారని, అయినా తాను తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్‌లో వెల్లడించారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో బంధించారని వైసీపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై ముందుగా రూ.3 వేల కోట్ల కుంభకోణం అని, ఆ తర్వాత రూ.230 కోట్ల కుంభకోణం అని, ఇప్పుడేమో రూ.27 కోట్ల కుంభకోణం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని, ఏనాడు తమ ప్రభుత్వం తప్పు చేయలేదని, నీతి నిజాయితీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్తే దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారన్నారు. వైసీపీ పెట్టే కేసులకు భయపడవద్దని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు.