లోకేశ్ పాదయాత్రకు టెంపరరీ బ్రేక్...
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు టెంపరరీ బ్రేక్ పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో లోకేష్ పాదయాత్రకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర కోనసీమ జిల్లాలోని రాజోలులోని పొదలాడకు చేరుకుంది. శుక్రవారం చంద్రబాబును సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో శనివారం ఉదయమే హుటాహుటిన లోకేశ్ విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచి యువనేత లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదిస్తూ విరామం లేకుండా ఉన్నారు. అనిశా కోర్టు తాజాగా చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దీంతో మళ్లీ పరిస్థితులు సాదారణ స్థితికి వచ్చే వరకు యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పరిస్థితులు సద్దుమనిగిన తరువాత మళ్లీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారని సమాచారం.
తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని.. ఇందులో రూ.271 కోట్లను షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నెల 22వరకు ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో 73ఏళ్ల వయస్సులో బాబు జైలుకు వెళ్లారు. ఇప్పటికే దేశంలో చాలా మంది మాజీ సీఎంలు అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ఎంతో మంది నేతలు జైలుకు వెళ్లారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ మాజీ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి.