YS Sharmila Schedule: రంగంలోకి వైఎస్ షర్మిల.. జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదే
X
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న షర్మిల.. నేటి నుంచి ఈ నెల 31 వరకు తొమ్మిది రోజులపాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటన చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాతో మంగళవారం నుంచి ఆమె పర్యటన ప్రారంభం కానుంది. పర్యటన నేపథ్యంలో నిన్న రాత్రే జిల్లాకు చేరుకున్న కొత్త చీఫ్ షర్మిలకు.. డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు స్వాగతం పలికారు. షర్మిల శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం బయల్దేరి వెళ్తారు. అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం పొందూరు నేత కార్మికుల సమస్యలపై చర్చావేదిక నిర్వహిస్తారు. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. షర్మిల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరరావు తెలిపారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో సమీక్షిస్తారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా సమీక్షను విజయనగరంలో నిర్వహిస్తారు. ఆ మరునాడు అంటే జనవరి 24న విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. 25వ తేదీన కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 29వ తేదీన తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లా, 30వ తేదీన శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది.