టీడీపీ - బీజేపీ పొత్తు లేదు.. జనసేనతో కలసి కమలం సై.. జగన్ మద్దతు గ్యారంటీ!
X
ఏపీలో ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉండడం లేదు! ఇరు పార్టీల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం లేదని, జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకే ఈ నెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి రావాలని చంద్రబాబుకు ఆహ్వానం పంపలేదని, పవన్ కల్యాణ్‌తో పొత్తుకోసమే ఆయన్ను పిలిచామని అంటున్నారు. చంద్రబాబు గత నెల ఢిల్లీలో కమల దళపతి జేపీ నడ్డాతోపాటు హోం మంత్రి అమిత్ షాను కలవడంతో పొత్తు ఉంటుందని వార్తలు వాచ్చాయి. నెలన్నరలో ఏం జరిగిందో ఏమోగాని రెండు పార్టీలు మనసు మార్చుకున్నాయి.
అక్కర్లేదు..
ఏపీలో తమకు బలం లేదు కాబట్టి పాత మిత్రుడికంటే కొత్త మిత్రుడితో కలిసి వెళ్తేనే కాస్త లాభం ఉంటుందని కమలనాథుల ఆలోచన. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని పలు సర్వేలు చెప్పడంతో, ఓడిపోయే బాబుతో కలసి ఓడిపోవడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్‌కు ఈసారి మెజారిటీ బాగా తగ్గుతుందన్న అంచనాల నడమ పవన్‌తో కలిస్తే కొన్ని సీట్లు వస్తాయని ఆశ. పవన్ ఇటీవల జోరు పెంచడం, వారాహి విజయ యాత్ర పేరుతో ప్రజలకు చేరువ కావడంతో ఆయనతో కలిస్తేనే బావుంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుపోవడం అసలుకే మోసమని చంద్రబాబు ఆలోచన. రాజకీయాల్లో ఆరితేరిన మాజీ సీఎం పరిస్థితిపై ఒక అంచనాకు రావడానికే బీజేపీ పెద్దలను కలిశారని, వారి మనోగతం తెలిశాక పొత్తు వద్దని నిర్ణయించుకున్నారని సమాచారం.
ఏపీకి ఏం చేశారు?
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. వైసీపీ 67 సీట్లకు పరిమితం కావడంలో పొత్తు కొంత ప్రభావం చూపింది. అయితే రాష్ట్ర విభజన హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాజధాని నిర్మాణానికి కూడా కొర్రీలు పెట్టింది. మోదీ అమరావతి నిర్మాణానికి మట్టి, నీరు తప్ప పైసా విదిల్చలేదని బాబు తిట్టిపోశారు. టీడీపీ తప్పిదాలు, జగన్ హవాతో బాబు 2019 ఎన్నికల్లో ఘోరంగా వోడారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ఏపీ ప్రజలకు బీజేపీపై నమ్మకం లేకపోవడంతోపాటు విశాఖ ఉక్కు కర్మాగార అమ్మకం గొడవ, బీజేపీ మతతత్వ అజెండా వంటి అనేక ప్రతికూల కారణాల వల్ల కూడా ఒంటరిగానే పోటీ చేయాలన్నది బాబు అభిమతం. జనసేనతో పొత్తు వల్ల కులసమీకరణాలోపాటు చాలా సమస్యలు వస్తాయని ఆయన భయం. మరోపక్క.. ఏపీలో తమకు ఒరిగేదేమీ ఉండడదని బీజేపీ ఆశలు వదిలేసుకుంది. జగన్ ఎప్పట్లాగే ఇకముందూ తమ వెంటే ఉంటారని ఆ పార్టీ నేతల ధీమా. ఆయన అక్రమాస్తుల కేసులపాటు, వివేకా హత్య కేసు సహా పలు అంశాల్లో తమ అవసరం ఉంటుంది కనుక గత్యంతరం లేక తమవైపు నిలబడారని భావిస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో తగినంత మెజారిటీ రాకపోతే వైసీపీ లాంటి పార్టీలే కమలనాథులకు ఆధారం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే బాబుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నల్లు తెలుస్తోంది.