కేంద్రం మరో నిర్ణయం.. స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం..
X
వైజాగ్ శాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ విక్రయానికి సిద్ధమైన మోడీ సర్కారు.. తాజాగా విశాఖ ఉక్కు ఆస్తుల అమ్మకానికి రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ప్రకటన జారీ అయింది. స్టీల్ ప్లాంట్ భూముల కోసమే ఉక్కు కర్మాగారం పీక నొక్కేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుండగా. ఇదే సమయంలో కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం.
కోట్ల విలువైన భూములు
విశాఖపట్నం హెచ్‌బీ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పాటు ఆటో నగర్‌లోని 2 ఎకరాల పరిధిలో ఉన్న 76 ఇళ్లు, పెదగంట్యాడలోని 434.75 చదరపు గజాల్లో ఉన్న 8 ఇళ్లను అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించి స్టీల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బాలరాజు ఈ నెల 9న ప్రకటన విడుదల చేశారు. ఆస్తులన్నింటినీ ఏకమొత్తంగా లేదా విడివిడిగా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు 10 రోజుల గడువు ప్రకటించారు. నగరం నడిబొడ్డున ఉన్న హెచ్‌బీ కాలనీలో అమ్మకానికి పెట్టిన 22.90 ఎకరాల స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,500 కోట్లు, ఆటోనగర్‌లోని రెండు ఎకరాల వాల్యూ రూ.100 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. .
కార్పొరేట్ కంపెనీల కోసమే..
స్టీల్ ప్లాంటు భూములు అమ్మి ఉక్కు కర్మాగారం నిర్వహించాలన్న ఆలోచనపై కార్మిక సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న ప్లాంట్ అవసరాలు తీరుతాయని, ఆ సొ్ము అయిపోయాక పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. విలువైన ఆస్తులను తక్కువ ధరకే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆస్తులను కేంద్రమే ఆధీనంలో పెట్టుకుని సున్నా వడ్డీకి రుణ సాయం చేస్తే ప్లాంటు నిలదొక్కుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెయిల్ను ఆదుకున్న కేంద్రం
నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. సెయిల్‌ను ఆదుకునేందుకు కేంద్రం చూపిన చొరవ విశాఖ ఉక్కుపై ఎందుకు చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెయిల్ 2016లో రూ.2,800 కోట్లు, 2017లో రూ.482 కోట్లు నష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో కేంద్రం చొరవ తీసుకుని సెయిల్‌కు కేటాయించిన గనుల్లోని ఐరన్ ఓర్ ను క్యాప్టివ్ మైన్ అమ్ముకునేలా ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో సెయిల్ లో తిరిగి లాభాల బాటపట్టింది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ కు ప్రత్యేక గనులు కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడంలేదు. రూ.20 వేల కోట్ల రుణాన్ని సున్నా వడ్డీకి ఇస్తే పదేళ్లలో తిరిగి చెల్లిస్తామన్న ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.