paritala sunitha : జైల్లోనే మొద్దు శీనును చంపారు.. మాకు మీపై నమ్మకం లేదు: పరిటాల సునీత
X
ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత చంద్రబాబు అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో ఆయన రక్షణపై భయాందోళనగా ఉందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న సునీత.. చంద్రబాబు భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జైలులో బాబు భద్రత గురించి మాట్లాడుతుంటే.. వైసీపీ నాయకులు జైలు గోడల గురించి ప్రస్తావిస్తున్నారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ గోడలు 50 అడుగుల ఎత్తు ఉన్నాయంటున్నారు. అంతే ఎత్తు, భద్రత ఉన్న అనంతపురం జిల్లా జైలులోనే మొద్దు శీనును హత్య చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జైలు భద్రతపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.
జైలులో అనేక రాకాల మనుషులు ఉంటారు. శత్రువులు కూడా ఉండొచ్చు. వారి వల్ల ప్రాణ హాని కలిగే అవకాశం తప్పక ఉంటుంది. చంద్రబాబుపై కక్షతో వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ కేసుతో అక్రమంగా లోపలేసి ఆనందం పొందుతున్నారని అన్నారు. ఎలాంటి అవినీతి లేని స్కిల్ డెవలప్మెంట్ స్కాంను తెరపైకి తీసుకొచ్చి.. ప్రజల్లో జగన్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. మొద్దు శీనుకు జరిగినట్లు చంద్రబాబుకు ఏమైనా జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాబు జైలు నుంచి విడుదల అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.