Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటా : పవన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటా : పవన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటా : పవన్
X

వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం గాజువాకలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ దోపిడీ చేస్తాడని తెలిసినా గాజువాకలో తనను ఓడించి వైసీపీని గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవాళ ఇదే గాజువాక నియోజకవర్గంలో తనకు ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించిందని, ఇంతటి ప్రేమను తాను ఊహించలేదని అన్నారు.

ఎన్నో పోరాటాలు చేస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని, ఎంతోమంది ప్రాణాలు అర్పించారని పవన్ తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, భూములిచ్చినవారిలో కొంతమంది పరిహారం అందలేదని వివరించారు. " స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని అమిత్ షాకు చెప్పాను. స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర పెద్దలకు కోరాను.

ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సూచించడం జరిగింది. ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే వారినే ఎన్నుకోవాలి. రౌడీషీటర్లకు అధికారమిస్తే ప్రశ్నించే ధైర్యం వారికి ఉండదు.

ఏపీ ఎంపీలంటే ఢిల్లీ పెద్దలకు చాలా చులకన.వైసీపీ నేతలకు పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించే దమ్ముందా..? " అని పవన్ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో డబ్బుతో ప్రమేయం లేకుండా తనకు అండగా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో తాను మాట్లాడతానని పవన్ తెలిపారు. కచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన జనసేనాని.. స్వార్థం లేకుండా ప్రజల కోసం మాట్లాడితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తప్పకుండా వింటారని చెప్పారు. విశాఖ ఎంపీ ఏనాడు స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో పోరాటం చేయలేదని పవన్ మండిపడ్డారు.

వైసీపీ నాయకులు అరిస్తే భయపడను, మీరు తిడితే వెనక్కి వెళ్లను... నేనొక మొండి మనిషిని అని పవన్ వ్యాఖ్యానించారు.ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజూ చూపిస్తాను అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి హెచ్చరించారు.


Updated : 13 Aug 2023 9:44 PM IST
Tags:    
Next Story
Share it
Top