ఈసారి అసెంబ్లీలో కచ్చితంగా అడుగుపెడతా.. సీఎం పోస్ట్ ఇస్తే సంతోషం.. పవన్
X
జనసేన పార్టీని నడపడానికి మాత్రమే తను సినిమాల్లో నటిస్తున్నానని, వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన జీవిత లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తను ఓడించడానికి ఎన్నో కుట్రలు జరిగాయని, ఇకపైనా జరుగుతాయని, అయినా సరే వచ్చే ఎన్నికల్లో తను గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావారి జిల్లా కత్తిపూడిలో బుధవారం జరిగిన ‘వారాహి యాత్ర’ తొలి బహిరంగ సభలో పవర్ స్టార్ ఎప్పట్లాగే ఆవేశపూరితంగా ప్రసంగించారు. వైకాపా పార్టీపై, ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు. పొత్తుల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేని, తమ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.
సీఎం పదవిపై
‘‘విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో నిర్ణయం కాలేదు. ఈసారి అసెంబ్లీలోకి జనసేన అడుగుపెట్టడం గ్యారంటీ. పాలకుడు నిజాయితీపరుడై ఉండాలి. బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తే కచ్చితంగా నిలదీస్తాం. నా పోరాటమంతా దోపిడీదారులపై, అవినీతిపరులపైనే. ఏపీలో అవినీతి, అరాచక పాలనసాగుతోంది. దీన్ని అంతం చేస్తాం. జనసేనకు వైకాపా భయపడుతోంది. 151 అసెంబ్లీ సీట్లున్న ఆ పార్టీ మాకు భయపడుతోందంటే మా శక్తి ఏమిటో రుజవవుతోంది’’ అని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా పుచ్చుకుంటానన్నారు. గత ఎన్నికల్లో తనను కక్షగట్టి ఓడించారని, ఈసారి అలా జరగకుండా పక్కా వ్యూహంతో గెలిచి అసెంబ్లీకి వెళ్తానన్నారు. ‘‘నా దగ్గర ఆస్తులు లేవు. పార్టీ నడిపించడం అంత సులభం కాదు. కేవలం ప్రజల ఆదరణతోనే మా పార్టీ నడుస్తోంది. నేను జనసేనను నడపడానికే సినిమాలు చేస్తున్నాను. జనసేనకు వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక నా సినిమాలు అడ్డుకున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.
వ్యక్తిగత వివరాలు అక్కర్లేదు..
తనకు రాజకీయాలు, ప్రజాప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని పవన్ స్పష్టం చేశారు. ‘‘వైసీపీ నేతల బాగోతాలు నాకు తెలుసు. వారి తప్పుడు పనుల ఫైళ్లు నా దగ్గర చాలా ఫైళ్లున్నాయి. కానీ నేను అలాంటి వివాదాలకు దూరం. విధానపరమైన విమర్శలు మాత్రమే చేస్తాను’’ అని పవన్ అన్నారు.