సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్
X
సనాతన ధర్మంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. కాలాన్ని బట్టి సనాతన ధర్మం మారుతూ ఉంటుందని అన్నారు. తప్పుల్ని సరిదిద్దుకుంటూ.. మార్పుల్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతుందని చెప్పారు. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ వెళుతుందని వ్యాఖ్యానించారు. ఈ దేశం అన్ని ధర్మాలను పాటిస్తుందని.. అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు.
మార్పును అంగీకరించి.. ధర్మాన్ని పాటించి.. ప్రేమతో ముందుకు వచ్చే వ్యక్తులే ఈ సమాజానికి దిశానిర్ధేశం చేయగలరని పవన్ అన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు యాస మారుతుందని, అయినా సరే కలిసే ఉంటాం.. అదే మన దేశ గొప్పదనం అని చెప్పారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇంకో మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజకీయం అంటే వ్యాపారం అనుకునే వారి కోసమే ఇదంతా చెబుతున్నా అని వ్యాఖ్యానించారు.
నాడు 389 మంది ప్రతినిధులు రాజ్యాంగాన్ని రూపొందించారు..ఇవాళ జగన్ వచ్చి అంతా నేనే అంటే చూస్తూ ఊరుకుంటామా? అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కొందరు అధికారులు రాజ్యాంగ అతిక్రమణలకు పాల్పడుతున్నారని, కులానికి, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అధికారులకు సిగ్గుండాలి అని విమర్శించారు. తన ప్రశాంతతను చేతగానితనంగా భావించొద్దని అన్నారు.