గోదావరి జిల్లాల్లో జగన్కు ఒక్క సీటు కూడా రానివ్వకుండా చూసుకుంటాం: పవన్ కళ్యాణ్
X
గోదావరి జిల్లాల్లో అభివృద్ధికి శ్రీకారం చుడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. గోదావరి జిల్లాల అభివృద్ధితో పాటు, కాలుష్య నివారణకు మాస్టర్ ప్లాన్ అమలుచేస్తామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా కొద్దిమంది చేతుల్లోనే వైద్యం, విద్యా ఉన్నాయన్న పవన్.. అధికారంలోని రాగానే వీటిని అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మార్పుకోసమే జనసేనను స్థాపించామని, తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేసేదే లేదని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
‘మార్పుకోసమే వచ్చాం. మధ్యలో వెనకడుగు వేసేదే లేదు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆపేది లేదు. గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారుచేస్తున్నాం. గోదావరి జిల్లాల్లో జగన్ పార్టీకి ఈసారి ఒక్క ఓటు కూడా రాకుండా చూసుకుంటాం. విద్య, వైద్యంలాంటి వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తామ’ని పవన్ స్పష్టం చేశారు.