Chandrababu : చంద్రబాబు నివాసానికి పవన్.. సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు
X
(Chandrababu) ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మరో రెండు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోన్నాయి. మరోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ.. జగన్ కు షాకివ్వాలని టీడీపీ-జనసేన ప్రణాళికలు రచిస్తున్నాయి. సీఎం జగన్ సిద్ధం పేరుతో వరుస సభలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు టీడీపీ - జనసేన సీట్ల సర్ధుబాటుపై ఫోకస్ పెట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడానికి ఈ ఎన్నికల్లో కలిసి నడవాలని టీడీపీ - జనసేన నిర్ణయించుకున్నాయి.
ఇందులో భాగంగా సీట్ల సర్ధుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ-జనసేన పార్టీలు దృష్టి సారించాయి. కాసేపట్లో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఎన్నికల్లో జనసేనకు 25 సీట్లు ఇస్తామని టీడీపీ చెబుతోంది. అయితే అంతకంటే ఎక్కువ సీట్లు కావాలని పవన్ పట్టుబడుతున్నారు. 40 నుంచి 50 సీట్ల వరకు పవన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరుపార్టీల అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ్టి భేటీలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.