జగన్‌ను వైఎస్ భారతి కంట్రోల్ చేయాలి : పవన్ కల్యాణ్
X
ఆంధ్రప్రదేశ్ డేటా మొత్తం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోనే ఉందన్నారు పవన్ కల్యాణ్. ఏపీ ప్రజల సమాచారం ఓ ఏజెన్సీకి ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండో విడత వారాహి యాత్ర తాడేపల్లిగూడెంలో పవన్ మాట్లాడారు. మరోసారి వలంటీర్ వ్యవస్థతో పాటు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. " వలంటీర్లపై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. వ్యవస్థ పనితీరును విమర్శిస్తున్నాను. అనేక నేరాల్లో వలంటీర్లు ఉన్నారు. ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో కొందరు వలంటీర్లు పట్టుబడ్డారు ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారు. వలంటీరు అంటే జీతం లేకుండా పనిచేయాలి. నెలకు జీతం తీసుకుని పనిచేసే వారిని వలంటీర్స్ అనరు. చదువుకోకుండా స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చిన జగన్‌కు వలంటీర్ అంటే తెలీదు.రెడ్ క్రాస్‌కు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ హెడ్‌గా ఉంటారు. జగన్.. నీ వలంటీరు వ్యవస్థకు అధిపతి ఎవరు ? వాలంటీర్లు అనేక చోట్ల ప్రజలను వేధిస్తున్నారు" అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
వలంటీర్స్ జీతంపై సెటైర్లు
వలంటీర్స్ జీతంపై పవన్ సెటైర్లు వేశారు. వలంటీరు వేతనం రోజుకు రూ.164.38 అంటే ఉపాధి హామీ కూలీ వేతనం కంటే తక్కువే అన్నారు. " వారి జీతం
భూమ్ భూమ్‌కి తక్కువ.. ఆంధ్రా గోల్డ్‌కి ఎక్కువ" అని సెటైర్లు వేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పటి వరకు రూ.1.35లక్షల కోట్ల మద్యం అమ్మారని పవన్ మండిపడ్డారు. ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతే జగన్ ముఖంలో నవ్వు వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారతిని వివాదాల్లోకి లాగలేదు
వైసీపీ నాయకులు తనను వ్యక్తిగతంగా విమర్శించడంపై పవన్ మండిపడ్డారు. జగన్‌ను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ విమర్శించలేదని, జగన్ సతీమణి వైఎస్ భారతిని వివాదాల్లోకి లాగలేదని చెప్పారు. కానీ జగన్‌కు మాత్రం సంస్కారం లేదని విమర్శించారు. తల్లి, చెల్లిపై గౌరవం లేని వ్యక్తి జగన్ అంటూ ధ్వజమెత్తారు. సొంత బాబాయినే హత్య చేసిన నేరగాళ్లుతో పోరాడుతున్నా అని పవన్ నిప్పులు చెరిగారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని జగన్‌కు ఆయన సతీమణి భారతి చెప్పాలని సూచించారు.
రాజకీయాలు అవసరం లేదు..
దేశంలోని ప్రముఖ నటుల్లో తాను కూడా ఒకడిని అని పవన్ తెలిపారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే అవసరం అవసరం లేదని చెప్పారు. పూర్తిగా సినిమాల్లో ఉంటే సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లుపైనే సంపాదిస్తానన్నారు. ప్రజలకు ఉపాధి, భద్రత కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు వివరించారు. నా భార్యను ఎవరితోనో తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తా అని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.