Ap politics : పవన్ ఢిల్లీ పర్యటన వాయిదా..బాబు చెంతకు జనసేనాని
X
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పెద్దగా సమయం కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. దీంతో పొత్తులపై క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంత వరకూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ పర్యటన కూడా ఖరారు అయ్యింది.
అయితే ఉన్నట్లుండి పవన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడింది. పవన్ ఢిల్లీ వెళ్లడానికి ముందు చంద్రబాబును కలవనున్నారు. ఇందుకోసం ఆయన నేడు విజయవాడకు బయల్దేరనున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీలో ఉన్నాయి. వీరి మధ్య పొత్తు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎన్నికలకు ముందు ఇప్పటికి కూడా ఆ పార్టీల మధ్య కొన్ని సర్దుబాటు చర్యలు జరగాల్సి ఉంది.
టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరనేలేదు. జనసేన పార్టీతో తాము కలిసే ఉన్నామని బీజేపీ చెబుతున్నప్పటికీ పవన్ నుంచి ఆ క్లారిటీ రావడం లేదు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి పోటీకి వెళ్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొంత సమయం పడుతోంది. పొత్తులు ఉంటాయా? లేక సింగిల్ గానే వైసీపీని ఢీకొంటాయా అనేది తెలియాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు పొత్తులు ఏర్పడినప్పటికీ తాము మాత్రం వాటిని ఢీకొట్టి మళ్లీ అధికారాన్ని చేపడుతామని వైసీపీ భావిస్తోంది.