ఏపీలోనే పెట్రోల్ ధరలు అధికం.. కేంద్రం వెల్లడి
X
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అన్ని రాష్ట్రాల్లో అధిక ధరలే ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధరలు మరింత ఎక్కువని కేంద్రం వెల్లడించింది. డీజిల్ రేట్లు మాత్రం లక్షద్వీప్ లో భారమని తెలిపింది.
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశ వ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటి వరకు లేదన్న ఆయన.. ఆయా రాష్ట్రాల్లో పన్ను ఆధారంగా ధరలు ఉన్నట్టు తెలిపారు. ఆ వివరాల్లో జులై 18వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను వెల్లడించారు.
కేంద్రం వెల్లడించిన వివరాలు ప్రకారం గరిష్టంగా ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.87 గా ఉంది. లక్షద్వీప్‌లో గరిష్టంగా లీటర్ డీజిల్ ధర రూ. 103. 08గా ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.78 మాత్రమే. ఇక ఏపీ కంటే తెలంగాణలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 కాగా, డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. కేరళ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 98.53గా ఉంది. ఏపీలోని అమరావతిలో లీటరు పెట్రోల్ ధర రూ.111.87లు ఉండగా.. డీజిల్ ధర 99.61గా ఉన్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.